గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ

journalist vaartha
By -
దామరచర్ల/ ఆగస్టు 9 (జర్నలిస్ వార్త): గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బతండాలో గిరిజన ఆడబిడ్డల ఆరాధ్య పండుగ తీజ్‌ను ఘనంగా నిర్వహించారు. తీజ్‌ పండుగ సందర్భంగా తండాలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ధీరావత్ స్కైలాబ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై గిరిజన ఆడబిడ్డలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్కైలాబ్ నాయక్ మాట్లాడుతూ తీజ్‌ పండుగ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఆడబిడ్డలకు మంచి గుణగణాలు కలిగిన భర్త లభించాలని, పాడిపంటలు, పశుసంపద సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ నవధాన్యాలను బుట్టల్లో విత్తనాలుగా నాటి తొమ్మిది రోజులపాటు ప్రత్యేకంగా సంరక్షిస్తారని తెలిపారు. మొలకలు ఏపుగా, పచ్చగా పెరిగితే తమ కుటుంబాలు కూడా సుఖసంతోషాలతో, పాడిపంటలతో కళకళలాడుతాయని గిరిజనులు విశ్వసిస్తారని చెప్పారు.తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలు ఉపవాస దీక్షలు చేపట్టి మొలకలకు నీరు పోస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం తీజ్‌ పండుగ ప్రత్యేకత అన్నారు. ప్రకృతితో ముడిపడిన ఇలాంటి పండుగలు గిరిజనుల జీవన విధానాన్ని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణి నాగునాయక్, గ్రామ పెద్దలు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.