వర్ధన్నపేట/జనవరి19(జర్నలిస్ట్ వార్త):
రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ సాయిబాబు మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలు, మద్యానికి బానిస కావడం వల్ల తమ భవిష్యత్తుతో పాటు కుటుంబాల జీవితం కూడా నష్టపోతుందని హెచ్చరించారు. మత్తు అలవాట్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు, నేరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వేగ నియంత్రణ పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలన్నారు.
చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చన్నారు. యువత చదువుతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుంచుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొచ్చు జ్యోతి, కాకతీయ స్కూల్ కరస్పాండెంట్ గోడిశాల శ్రీనివాసులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పలువురు నాయకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.