వర్ధన్నపేట/జనవరి22(జర్నలిస్ట్ వార్త);
ఇల్లంద గ్రామంలో కోతుల బెడద రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది కోతులు ఇళ్లలోకి చొరబడి దాడులు చేయడంతో పాటు రక్కి గాయపరుస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనగా, ఈ సమస్యపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కోతుల నుంచి మా ప్రాణాలను కాపాడండి,అంటూ గ్రామస్తులు వేడుకుంటున్న నేపథ్యంలో, ఇల్లంద గ్రామ సర్పంచ్ బేతి సాంబయ్య వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. కోతులను భయపెట్టేందుకు చింపాంజీ రూపంలో వేషాలు ధరించే ప్రయోగాన్ని చేపట్టారు.
సొంత నిధులు వెచ్చించి చింపాంజీ మాస్క్‌లు తెప్పించి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కలిసి చింపాంజీ వేషధారణలో కోతులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కోతులు ఎక్కువగా సంచరించే కాలనీల్లో చింపాంజీ వేషాల్లో సిబ్బంది పరుగులు పెడుతూ, హావభావాలు, చేష్టలతో కోతులను హడలెత్తించారు. ఈ వేషధారణను చూసి భయపడిన కోతులు తుర్రుమని పారిపోవడంతో గ్రామస్తులకు తాత్కాలికంగా ఊరట లభించింది. సిబ్బందికి వేషాలు ధరించడం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ప్రజలకు కోతుల బెడద నుంచి విముక్తి కలగడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వినూత్న ఐడియా అదుర్స్‌గా ఉందని గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తుండగా, కోతుల సమస్యకు ప్రస్తుతం ఇదే సరైన మార్గంగా కనిపించిందని సర్పంచ్ బేతి సాంబయ్య తెలిపారు.