వర్ధన్నపేట/జనవరి 28 (జర్నలిస్ట్ వార్త);
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి వర్ధన్నపేట నియోజకవర్గంపై పడింది. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన పార్టీల మధ్య మొదలైన ఈ 'కండువల జాతర' నియోజకవర్గంలో ఎటు చూసినా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి గులాబీ గూటికి చేరుతుండటం ఈ పరిణామాల్లో అత్యంత కీలకమైన అంశం. సుమారు 500 కార్ల భారీ ర్యాలీతో, వేలాది మంది అనుచరులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తరలివెళ్లిన ఆరూరి రమేష్, కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం నియోజకవర్గంలో ఒక పెద్ద రాజకీయ ప్రకంపనగా మారింది. ఈ భారీ బలప్రదర్శన కేవలం ఒక పార్టీ మార్పు మాత్రమే కాదని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తన పట్టును నిరూపించుకోవడానికి ఆరూరి వేసిన బలమైన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్ధన్నపేట
మాజీ ఎంపీటీసీ గుజ్జ వీరన్న వంటి నేతలు టీఆర్ఎస్‌లో చేరడం ద్వారా విపక్షాలకు గట్టి సవాల్ విసిరారు. అయితే, అధికార పక్షం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ ఇతర పార్టీల నుండి కీలక నేతలను ఆకర్షిస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త దామోదర్‌ను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా, మేధావుల, విద్యావంతుల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక పార్టీ నుంచి మరో పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి నేతల వలసలతో వర్ధన్నపేట రాజకీయం ఒక చదరంగంలా మారింది. మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో ఓటర్లను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆరూరి రమేష్ వెంట వెళ్తున్న వేల సంఖ్యలోని కార్యకర్తలు, ఎర్రబెల్లి దయాకర్ రావు మార్గదర్శకత్వం, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారిక బలం.. ఈ మూడింటి మధ్య జరగనున్న పోరు రాష్ట్రంలోనే వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్చేశాయి. రాబోయే రోజుల్లో ఈ కండువల జాతర ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో , ఈ రాజకీయ వలసలు ఏ పార్టీకి విజయాన్ని కట్టబెడతాయో వేచి చూడాలి.