వర్ధన్నపేట/జనవరి29 (జర్నలిస్ట్ వార్త):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిస్తున్న పాలనను చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మండిపడ్డారు. గురువారం వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలనలో నియోజకవర్గం ఎదుర్కొన్న నిర్లక్ష్యాన్ని, ప్రస్తుత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హయాంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. గత 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవించిన పాలకులు కేవలం తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని, దళితులమని చెప్పుకుంటూనే వర్ధన్నపేట అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా బిజెపి నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన సదరు నాయకుడి చరిత్ర నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రజా సంక్షేమాన్ని వదిలేసి రియల్ ఎస్టేట్ దందాలతో తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో ప్రతిదీ దోచుకున్నారని, అందుకే గత ఎన్నికల్లో ప్రజలు ఆయనకు 20 వేల ఓట్ల తేడాతో తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన బిఆర్ఎస్ లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని, ఆయనో గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిలా బిఆర్ఎస్ శ్రేణులు ఊహల పల్లకిలో ఊరేగడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
వానకాలంలో బి జె పి పార్టీ లో ఉండి, యాసంగి వచ్చేసరికి బిఆర్ఎస్ లో చేరే ఇలాంటి నాయకులకు ఆత్మవిమర్శ ఉండాలని హితవు పలికారు. 20 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన వారెవరూ పార్టీని వీడటం లేదని, కేవలం స్వలాభం కోసం పార్టీలు మారే వారిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పద్ధతిగా పార్టీలో చేరడం అంటే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విద్యావేత్త, బీసీ బిడ్డలా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నాయకత్వంలో వర్ధన్నపేట అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, సుమారు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మున్సిఫ్ కోర్టు, సబ్ జైలు వంటి కీలక నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులను చూసి మేధావులు, ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని, రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపిలు గల్లంతు కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగరాజన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని వెంకటయ్య స్పష్టం చేశారు.