తల్లి జ్ఞాపకార్థంగా కాలనీ ఆర్చ్ నిర్మాణం – ఇల్లందలో వినాయక నగర్ ఆర్చ్ ఘన ప్రారంభోత్సవం

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి27(జర్నలిస్ట్ వార్త):
తల్లిదండ్రుల విలువలు తగ్గిపోతున్న ఈ కాలంలో, తన తల్లి జ్ఞాపకార్థంగా శాశ్వత గుర్తుగా కాలనీ ఆర్చ్‌ను నిర్మించి ఒక కొడుకు చూపిన కృతజ్ఞత భావం ఇల్లంద గ్రామంలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇల్లంద గ్రామానికి చెందిన సమ్మెట వీరలక్ష్మి – సమ్మయ్య దంపతుల కుమారుడు సమ్మెట మహేష్ గౌడ్ చిన్నతనంలోనే తన తల్లి వీరలక్ష్మిని కోల్పోయాడు. తల్లి మరణించినా ఆమె జ్ఞాపకం, ఆశీస్సులు ఎప్పటికీ తన జీవితానికి మార్గదర్శకంగా ఉండాలన్న భావనతో ఆమె స్మరణార్థంగా ఏదో ఒక శాశ్వత గుర్తింపు ఉండాలనే సంకల్పంతో కాలనీ ఆర్చ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఇల్లంద గ్రామంలోని 11, 12 వార్డులను కలిపే కాలనీకి వినాయక నగర్ గా నామకరణం చేస్తూ, సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయల వ్యయంతో ఆధునిక హంగులతో, ఆకర్షణీయంగా కాలనీ ఆర్చ్‌ను నిర్మించారు. ఈ ఆర్చ్ కాలనీకి ప్రత్యేక గుర్తింపుగా నిలవడమే కాకుండా గ్రామాభివృద్ధికి కూడా దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.
ఈ ఆర్చ్ ప్రారంభోత్సవం ఆదివారం గ్రామ పెద్దలు, ప్రముఖులు, అజాద్ హింద్ ఫౌజ్ యూత్, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై వేడుకను విజయవంతం చేశారు. ప్రారంభోత్సవ అనంతరం అతిథులకు స్వీట్స్ పంపిణీ చేశారు .తల్లిదండ్రులను భారంగా భావించే ఈ రోజుల్లో, తన తల్లి జ్ఞాపకార్థంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కాలనీ ఆర్చ్ నిర్మించడం ద్వారా సమ్మెట మహేష్ గౌడ్ యువతకు ఆదర్శంగా నిలిచారని గ్రామ పెద్దలు కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవీయ విలువలను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం యువతలో తల్లిదండ్రుల పట్ల గౌరవం, కృతజ్ఞత భావాన్ని పెంచేలా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.