ఐనవోలులో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్

journalist vaartha
By -
 
ఐనవోలు/జనవరి 18 (జర్నలిస్ట్ వార్త):
హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామిని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఆలయ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బండి సుధాకర్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు చెక్ పెట్టి ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు.
ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం, మహిళలకు ఇందిరా  చీరల పంపిణీ, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి కీలక నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని చెప్పారు. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం సహా అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్ల రేవంత్  సర్కార్‌కు విస్తృత ప్రజాదరణ లభిస్తోందన్నారు.
మల్లికార్జున స్వామి దేవాలయం  మహిమలతో విరాజిల్లుతోందని, తెలంగాణలో సమ్మక్క–సారలమ్మ జాతర తర్వాత అత్యంత పెద్ద జాతర మల్లికార్జున స్వామి జాతరేనని పేర్కొన్నారు. కోరిన కోరికలు తీరుస్తాడనే విశ్వాసంతో రాష్ట్ర ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.