రేపు వరంగల్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకలు

journalist vaartha
By -


వరంగల్/ఏప్రిల్ 13(జర్నలిస్ట్ వార్త): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ జిల్లా చైర్మన్ బిర్రు మహేందర్ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 9 గంటలకు నగరంలోని కాశిబుగ్గ సెంటర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం హన్మకొండలోని కేఎంసీ  ఆడిటోరియంలో భారీ బహిరంగ మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు హాజరుకావాలని కోరారు. దళిత, ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు, నిరుద్యోగులు  అన్ని రాజకీయ పార్టీల శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.