నెహ్రూ విగ్రహంపై వివాదం.. ధర్మసాగర్‌లో ఉద్రిక్తత

journalist vaartha
By -
ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో, జూన్ 17: (జర్నలిస్ట్ వార్త)హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన నెహ్రూ విగ్రహం చుట్టూ వివాదం నెలకొంది. సుమారు 80 నుంచి 90 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్న నెహ్రూ విగ్రహం ముందు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గేటు నిర్మించడంతో వివాదానికి దారితీసింది.గేటు ఏర్పాటు కారణంగా నెహ్రూ విగ్రహం దర్శనానికి అంతరాయం కలుగుతోందని, చారిత్రక గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నమని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గేటు నిర్మాణాన్ని సమర్థిస్తున్న వర్గం కూడా ఉండటంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో ధర్మసాగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి స్పందించి నెహ్రూ విగ్రహాన్ని ఉన్నచోటనే కొనసాగించాలని సూచిస్తూ గ్రామంలో నోటీసులు అంటించారు. విగ్రహం తరలింపు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రత్యేక చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నెహ్రూ విగ్రహం యథాస్థానంలో కొనసాగుతుందా, లేక మార్పులు జరుగుతాయా అన్నది ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.