వర్ధన్నపేట/జులై 24(జర్నలిస్ట్ వార్త);
నీట్ పేపర్ లీకేజీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులను ఖండించారు. తాను పోలీస్ సర్వీసులో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా విద్యార్థులపై లాఠీచార్జ్ చేయలేదని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.