ఐనవోలు/జులై 24(జర్నలిస్ట్ వార్త);
సమస్య పరిష్కారానికి వచ్చిన ఊరి సర్పంచ్‌పైనే కులం పేరుతో దూషణలకు దిగిన సంఘటన ఐనవోలు మండల పరిధిలోని పెరుమాండ్లగూడెంలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం. గ్రామంలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదాన్ని సమసిపోయేలా చేసేందుకు సర్పంచ్ రాకేష్ ఇరువర్గాలను మాట్లాడేందుకు పిలిపించారు. ఈ క్రమంలో పంచాయతీ నచ్చని పిడుగు శ్రీకాంత్, రాకేష్ అనే వ్యక్తులు గ్రామ ప్రథమ పౌరుడనే గౌరవం లేకుండా సర్పంచ్‌పై విరుచుకుపడ్డారు. ఆయనను అందరి ముందే కులం పేరుతో హేళన చేస్తూ, తీవ్ర పదజాలంతో దూషించారు. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన ఐనవోలు పోలీసులు నిందితులైన పిడుగు శ్రీకాంత్, రాకేష్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.