ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జాప్యానికి తావివ్వొద్దుఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

journalist vaartha
By -
హసన్ పర్తి/ జూలై 19 (జర్నలిస్ట్ వార్త): రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతం చేసి, గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని అధికారులకు, పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.హనుమకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్‌రాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి నజీర్ గార్లతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు ఫారాలను పూర్తి చేయించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షించడమే ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసిన తొలి 100 మంది బూత్ లెవల్ ఏజెంట్లకు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా సన్మానం నిర్వహించనున్నట్లు తెలిపారు.సమావేశానికి ముందు పెట్రోల్ దాడిలో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు అడుప మహేష్ చిత్రపటానికి నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్ రావలిరెడ్డి, నియోజకవర్గ, మండల, డివిజన్, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.