హసన్‌పర్తి,/ జూలై 19 (జర్నలిస్ట్ వార్త): గోపాల్‌పూర్ చెరువు అభివృద్ధి పనుల పేరుతో నల్లమట్టిని అక్రమంగా తరలించి, అదే మట్టితో భీమారంలో నాసిరకం రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అటికం రవీందర్ ఆరోపించారు. ఆదివారం భీమారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గోపాల్‌పూర్ చెరువులో నుంచి రాత్రి వేళల్లో భారీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్ల సహాయంతో నల్ల రాగడి మట్టిని తరలించి, ప్రైవేట్ వాహనాల ఎస్కార్ట్ మధ్య భీమారం బొడ్రాయి సమీపంలోని రోడ్డు, డ్రైనేజీ పనుల్లో వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ మట్టితో చేపడుతున్న పనులు నాసిరకంగా ఉండటంతో భవిష్యత్తులో రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు.ఇద్దరు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్నా మైనింగ్, మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రామ ప్రజలకు అవసరమైన పనులను పక్కనపెట్టి, అవసరం లేని చోట అభివృద్ధి పేరిట నిధులు ఖర్చు చేస్తూ కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు, బాధ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.భీమారం ప్రధాన రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును కలిసి వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.మట్టి అక్రమ రవాణా, నాసిరకం పనులపై స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే భీమారంలో పోసిన రాగడి మట్టిని వెంటనే తొలగించి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విక్టర్ బాబు, రాయకంటి సురేష్, నాయకపు శ్రీనివాస్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గుంజె సాయికుమార్, నాతి సమ్మయ్య, పోగుల రమేష్, ఉప్పు ప్రభాకర్, బెతెళ్లి వినయ్, ఉప్పు రమేష్, ఎర్రబెల్లి సంపత్‌రావు, పల్లపు రవికుమార్, బూర రోషన్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పేరుతో అక్రమాలు.. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలిభీమారంలో నాసిరకం పనులు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ నేత అటికం రవీందర్ ఆరోపణ
By -
July 19, 2026