ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి. ఈగ మల్లేశం

journalist vaartha
By -
హనుమకొండ/ఆగస్టు 12(జర్నలిస్ట్ వార్త);నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచులు గ్రామాల అభివృద్ధితోపాటు కులబంధువుల సంక్షేమానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షుడు ఈగ మల్లేశం సూచించారు. హనుమకొండలోని వి-గ్రాండ్‌ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బచ్చు ఆనందం ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల బాధ్యత కత్తిమీద సాములాంటిదని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పద్మశాలీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. వరంగల్‌లో వస్త్ర రూపకల్పన కళాశాల ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.