వర్ధన్నపేట/జనవరి 22 (జర్నలిస్ట్ వార్త):
రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న వ్యాఖ్యలు పగటి కలలకే పరిమితమని వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు విమర్శించారు. గురువారం వర్ధన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ముఖ్య అతిథిగా పిలిచి, కొత్త బట్టలు పెట్టి మరీ కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూపిస్తామని ఎద్దేవా చేశారు. పేదల పక్షాన నిలిచింది ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు. వర్ధన్నపేటలో 100 పడకల ఆసుపత్రి దారి మళ్లుతోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని శేఖర్ రావు కొట్టిపారేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. గతంలో భూకేటాయింపుల్లో జరిగిన సాంకేతిక లోపాలను సరిదిద్ది, ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రి విషయాన్ని పట్టించుకోని ఎర్రబెల్లి, ఇప్పుడు రాజకీయ ఉనికికోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వర్ధన్నపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. 12 వార్డులకు 12 గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలు కేవలం భ్రమ మాత్రమేనన్నారు. గత పదేళ్ల అవినీతిని ప్రజలు మర్చిపోలేదని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, చిటూరి అశోక్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, మైస సురేష్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.