ఐకెపి కేంద్రంలో ధాన్యం అమ్మిన రైతులకు చుక్కెదురు మిల్లర్ల కటింగులతో రూ.30 లక్షల నష్టంలైసెన్సులు రద్దు చేయాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

journalist vaartha
By -

వేంసూరు/జనవరి 22 (జర్నలిస్ట్ వార్త);
ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం లచ్చన్నగూడెంలో రైతులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గతేడాది సారవ వరి పంటను ఐకెపి కేంద్రంలో విక్రయించిన రైతులను మిల్లర్లు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. క్వింటాకు 14 కిలోల చొప్పున అక్రమ కటింగులు విధించి ట్రక్‌ షీట్లలో తక్కువ బరువు నమోదు చేయడంతో రైతులు లక్షల రూపాయలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలకొండపల్లికి చెందిన సహస్ర రైస్ మిల్లు, అరుణాచల శివ రైస్ మిల్లు యాజమాన్యాలు ఐకెపి సిబ్బంది నమోదు చేసిన బస్తాల సంఖ్య, క్వింటాళ్లను ట్రక్‌ షీట్లలో తగ్గించి రాసి, అదే ఆధారంగా చెల్లింపులు చేయించినట్లు రైతులు ఆరోపించారు. ఈ దగాతో 24 మంది రైతులు, బోనస్‌తో కలిపి సుమారు రూ.30 లక్షల వరకు నష్టపోయినట్లు నిర్ధారించుకున్నారు.
మిల్లర్ల మోసాన్ని నిరసిస్తూ గురువారం రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అక్రమ కటింగులకు పాల్పడిన మిల్లర్ల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కటింగుల వివరాలు ముందుగా చెప్పలేదు. గ్రేడ్–ఏ అని నిర్ధారించిన ధాన్యానికి కోతలు ఎలా విధిస్తారు? ట్రక్‌ షీట్లలో ఐకెపి సిబ్బంది రాసిన వివరాలను మిల్లర్లు ఎలా మార్చి సంతకాలు, ముద్రలు వేశారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినతిపత్రం స్వీకరించిన నాయబ్ తహశీల్దార్ బంతిరాం స్పందిస్తూ, ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్, రైతులు ఇమ్మడి మల్లేశ్వరరావు, నాయుడు శ్రీనివాసరావు, బోయినపల్లి సత్యనారాయణ, రాయల నరసింహారావు, ఇమ్మడి శంకర్‌రావు, అన్నపురెడ్డి కృష్ణయ్య, పతేపరుపు అంజారావు, హనుమంతరావు, మాణికల రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.