వర్ధన్నపేట/జనవరి20 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్ల నగరాభివృద్ధి నిధులతో చేపట్టనున్న సి.సి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా తదితర పనులకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో ప్రాథమిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. సి.సి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో ప్రజల అవసరాలకు వినియోగిస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం, అవకతవకలు సహించబోమని హెచ్చరించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలని సూచించారు.
మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వార్తలు ప్రచురించాలని కోరారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రితో తమకు ఎలాంటి వ్యక్తిగత లాభం లేదని స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా జరగని అభివృద్ధిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపుతోందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.