ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరో జనవరి 20: (జర్నలిస్ట్ వార్త);
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధిలో ఉద్యమ కళాకారులకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఇంద్ర పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో కళాకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ గళాన్ని వినిపించారు.తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులను ప్రభుత్వం విస్మరించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంలో పాటలు, నాటకాలు, కళా ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన తమకు ఇప్పటికీ సరైన గుర్తింపు, ఉపాధి కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
సాంస్కృతిక సారధి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, అర్హులైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు, కొట్టే రమేష్ నక్క సుమన్ ఆరూరి పూలమ్మ పలువురు కళాకారులు పాల్గొన్నారు.