వర్ధన్నపేట/జనవరి 20 (జర్నలిస్ట్ వార్త)
వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని వర్ధన్నపేట టౌన్ పరిధిలోని పల్లెబాట సమీపంలో రూ.28 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నేడు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్మాణంతో వర్ధన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత సమీపంలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అత్యవసర చికిత్సలు, ప్రత్యేక వైద్య విభాగాలు, ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.