గీసుగొండలో గంజాయి విక్రయ యత్నం భగ్నం242 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం – ముగ్గురు అరెస్ట్

journalist vaartha
By -

గీసుగొండ,/జనవరి 22 (జర్నలిస్ట్ వార్త):
గీసుగొండ మండలంలో గంజాయి విక్రయానికి యత్నించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కె. కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం మధ్యాహ్నం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో స్తంబంపల్లి కేవీఎస్ హైస్కూల్ జంక్షన్ వద్ద కవర్లతో అనుమానాస్పదంగా నిల్చున్న నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి మొత్తం 242 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ఉన్న మరో నిందితుడిని కిరణ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిని శశాంత్ (అలియాస్ గౌరి కిశోర్), షేక్ మోసిన్, కోయల సందీప్గా గుర్తించారు. వీరిలో శశాంత్‌పై గతంలో గంజాయి మరియు దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు.స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో నమోదు చేసి, నిందితులను గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ మాట్లాడుతూ, నిందితులపై మత్తు మరియు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అక్రమ మాదకద్రవ్యాల కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను ఆయన కోరారు.