వర్ధన్నపేట/జనవరి23(జర్నలిస్ట్ వార్త):
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను వర్ధన్నపేట మండలానికి వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమం కింద అదనపు వ్యవసాయ పనిముట్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా మండలంలోని రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం కింద రోటవేటర్లు 10, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లులు 2, డిస్క్ హరోలు 13, బండ్ ఫార్మర్ 1 యూనిట్‌ను కేటాయించినట్లు పేర్కొన్నారు. రోటవేటర్లలో జనరల్‌కు 7, ఎస్సీకి 2, ఎస్టీకి 1 యూనిట్‌లను, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లుల్లో జనరల్‌కు 1, ఎస్సీకి 1 యూనిట్‌ను కేటాయించారు. అలాగే డిస్క్ హరోలలో జనరల్‌కు 11, ఎస్సీకి 1, ఎస్టీకి 1 యూనిట్‌లు, బండ్ ఫార్మర్‌ను ఎస్సీ వర్గానికి కేటాయించినట్లు తెలిపారు.
సబ్సిడీ వివరాలు ఇలా ఉన్నాయి:
5 ఎకరాల లోపు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు, అలాగే ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ వర్తించనుంది. ఇతర అర్హులైన రైతులకు 40 శాతం సబ్సిడీ అందజేయనున్నారు.
ఆసక్తి గల రైతులు దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ట్రాక్టర్ ఆర్‌సీ జిరాక్స్‌తో పాటు (ట్రాక్టర్ ఆర్‌సీలో “వ్యవసాయ పనుల కోసం” అని నమోదు అయి ఉండాలి) ఐదు రోజులలోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
ఈ అవకాశాన్ని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో విజయ్ కుమార్ తెలిపారు