కిలవరంగల్/జనవరి 21 (జర్నలిస్ట్ వార్త):
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గార్ల విగ్రహాల ప్రతిష్టకు కిల వరంగల్‌లో స్థల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. కాకతీయ రాజులు పరిపాలించిన చారిత్రాత్మక ప్రాంతమైన కిల వరంగల్ పాత పెట్రోల్ పంపు చౌరస్తాను విగ్రహాల ప్రతిష్టకు అనువైన స్థలంగా కమిటీ సభ్యులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయపురం సాంబయ్యతో పాటు విగ్రహ ప్రతిష్ట కమిటీ గౌరవ సలహాదారులు, అధ్యక్షులు, కార్యదర్శులు, గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సమానత్వం, విద్యాభివృద్ధి, రాజ్యాంగ విలువలను ప్రజల్లో మరింత బలంగా చాటిచెప్పేలా ఈ విగ్రహాల ప్రతిష్ట ఉండాలని వారు అభిప్రాయపడ్డారు.మహానాయకుల ఆలోచనలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని, కిల వరంగల్ చరిత్రలో ఈ కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని నేతలు పేర్కొన్నారు