సమన్వయంతో మేడారం జాతర సక్సెస్‌ చేయాలివరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశం

journalist vaartha
By -
ధర్మసాగర్ /జనవరి హనుమకొండ బ్యూరో23 (జర్నలిస్ట్ వార్త):
మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్, ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
గత జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, కారణాలపై సమీక్షించి ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ చేపట్టిన ఏర్పాట్లను ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మేడారం వెళ్లే మార్గాల్లో బస్సులు నిలిపి టికెట్లు జారీ చేయరాదని, గతంలో సమస్యలు సృష్టించిన డ్రైవర్లను విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశించారు. డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.
బస్సులు బ్రేక్‌డౌన్ అయిన వెంటనే మరమ్మత్తులు చేపట్టేలా టెక్నీషియన్లు అందుబాటులో ఉండే విధంగా క్యాంపులు ఏర్పాటు చేయాలని, రోడ్లపై బస్సులు నిలిపివేయకుండా చూడాలని సూచించారు. బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సులు మధ్యలో ఆగకుండా నేరుగా మేడారం బస్టాండ్‌లోనే ఆగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తులు కాలకృత్యాలు, తినుబండారాలు ముందే ఏర్పాట్లు చేసుకునేలా బస్టాండ్‌లలో విస్తృత ప్రచారం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
హనుమకొండ బాలసముద్రం నుంచి జాతరకు వెళ్లే బస్సులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నగరంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బస్సులను తరలించేలా ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ అధికారులకు సీపీ ఆదేశించారు.
ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు సత్యనారాయణ, జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంలు భాను కిరణ్, మహేష్, డిపో మేనేజర్లు రవిచందర్, అర్పిత, ధర్మాసింగ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాతతో పాటు పోలీస్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.