ఐనవోలు/జనవరి21 (జర్నలిస్ట్ వార్త);
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామంలో కుటుంబ కలహం విషాదానికి దారి తీసింది. పొయ్యిల కట్టెల విషయమై జరిగిన గొడవలో రాయి తగిలి ఓ వృద్ధురాలు మృతి చెందడం గ్రామంలో కలకలం రేపింది.ఐనవోలు పోలీస్ అధికారి పస్తం శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం పెరుమాండ్లగూడెం గ్రామానికి చెందిన కత్తుల ఐలమ్మ (చేరాలు భార్య) కుటుంబంలో పొయ్యిల కట్టెల పంపకం విషయమై వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమారుడి కుమారుడు కత్తుల బన్ని, చిన్న కుమారుడు కత్తుల కొమురయ్య మధ్య వాగ్వాదం జరిగింది.గొడవ తీవ్రంగా మారడంతో ఆవేశానికి లోనైన కత్తుల బన్ని పక్కనే ఉన్న రాయిని బలంగా విసిరివేశాడు. ఆ రాయి పొరపాటున అక్కడే ఉన్న కత్తుల ఐలమ్మకు డొక్కలో తాకింది. దీంతో ఆమె స్పృహ కోల్పోయి కూలిపోయింది.తీవ్రంగా గాయపడిన ఐలమ్మను కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై కత్తుల బన్నీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.