వర్ధన్నపేట బాస్ ఈజ్ బ్యాక్.. ఆరూరి రాకతో మారనున్న రాజకీయ ముఖచిత్రం!

journalist vaartha
By -
వర్ధన్నపేట/జనవరి26 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట రాజకీయ కోటలో మళ్ళీ పాత హవా మొదలుకాబోతోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రూపంలో ఒక రాజకీయ సునామీ రాబోతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు రాజకీయాలకు కొంత దూరంగా, ‘సైలెంట్’ మోడ్‌లో ఉన్న ఆరూరి, ఇప్పుడు ఒక్కసారిగా బీజేపీకి గుడ్ బై చెప్పి మళ్ళీ కారు ఎక్కేందుకు సిద్ధమవ్వడం నియోజకవర్గంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆరూరి రమేష్ అంటేనే ఒక బ్రాండ్ అని, పదేళ్ల పాటు వర్ధన్నపేటను తన అడ్డాగా మార్చుకున్న ఆయన మనసంతా పాత గూటిపైనే ఉందనేది తాజా రాజీనామాతో తేలిపోయింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన అనుచరులు చేస్తున్న సోషల్ మీడియా హడావిడి చూస్తుంటే, ఈసారి అడుగులు పక్కా వ్యూహంతో పడుతున్నాయని అర్థమవుతోంది. బీజేపీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడం ఒక కారణమైతే, తన సొంత నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను ఆరూరి క్షుణ్ణంగా విశ్లేషించుకుని, వెన్నంటే ఉండి వెన్ను పోటు పొడిచే వారిని గమనిస్తూ, దళిత ఓటర్ల అసంతృప్తిని, కాంట్రాక్టర్ల, రియల్ ఎస్టేట్ దారులకే, ప్రాధాన్యత ఇచ్చారన్న అపవాదును ఈసారి చెరిపేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన వర్ధన్నపేటలో దళితులతో మళ్ళీ మమేకం అయ్యేందుకు, కేసీఆర్ అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనకున్న పట్టును ప్రదర్శించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ, తన వెంటే పాత నాయకులంతా మళ్ళీ కారు ఎక్కేలా పావులు కదుపుతున్నారు. రాజకీయాల్లో చాణక్యుడిగా పేరున్న ఆరూరి, ఇప్పుడు బీఆర్ఎస్ లోకి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనుండటంతో
 నియోజకవర్గ ముఖచిత్రం మారడం ఖాయంగా కనిపిస్తోంది. తన రాకతో నియోజకవర్గం తో పాటు రాష్ట్రం లో బి ఆర్ ఎస్ పార్టీ కి పట్టు పెరిగే అవకాశాలు ఉన్నాయని గట్టిగా తెలుస్తుంది.
ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేలా తన ఎత్తుగడలను సిద్ధం చేసుకున్న ఆయన రాకతో అటు గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రాగా, ఇటు ప్రత్యర్థుల్లో అప్పుడే వణుకు మొదలైందనే చర్చ నడుస్తోంది. తన పాత తప్పులను దిద్దుకుని, మళ్ళీ వర్ధన్నపేట గడ్డపై తన జెండాను ఎగరేయడమే లక్ష్యంగా బాస్   సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు.