వర్ధన్నపేట/జనవరి26(జర్నలిస్ట్ వార్త):
రాజకీయాల్లో అధికారం ఉన్నా లేకపోయినా, జనం గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడికి కాలమే మళ్ళీ ఎర్ర తివాచీ పరుస్తుందని వర్ధన్నపేట రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రూపంలో నియోజకవర్గంలో మళ్ళీ పాత హవా మొదలుకాబోతోంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోని జాఫర్ గడ్ మండలం లోని ఉప్పుగల్లు గ్రామం మట్టిలో పుట్టి, అరూరి రేమేష్
సామాన్య కాంట్రాక్టర్ స్థాయి నుండి రాజకీయ శిఖరాలను అధిరోహించిన ఆరూరి ప్రస్థానం ఒక అద్భుత కావ్యం. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, తొలి అడుగులోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో సుమారు 30 వేల ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ ఓటమి ఆయనను కుంగదీయలేదు, పైగా ప్రజల్లోనే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేలా చేసింది. 2013లో టిఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన వేసిన ప్రతి అడుగు ఒక మైలురాయిగా మారింది. 2014 తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 84 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించి, రాష్ట్రంలోనే మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత రెండో అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా నిలిచి రికార్డు సృష్టించారు. ఆ విజయ పరంపర 2018లో మరింత ఉవ్వెత్తున ఎగిసిపడి, ఏకంగా లక్ష ఓట్ల భారీ మెజార్టీతో మళ్ళీ రాష్ట్రస్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుని తన తిరుగులేని ప్రజాదరణను చాటుకున్నారు. అయితే, గత ఎన్నికల్లో ఆరూరి రమేష్ ఓటమి పాలవ్వడం వెనుక పార్టీ నాయకులు, లీడర్స్ అనేక అంతర్గత కలహాలే ప్రధాన కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో తనతోనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన కొందరు నాయకుల వల్ల, క్షేత్రస్థాయి కార్యకర్తల అసహనం వల్ల గెలుపు ముంగిట బోల్తా పడాల్సి వచ్చింది. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారనే అపవాదు, దళిత నియోజకవర్గమైన వర్ధన్నపేటలో దళితులను ఆర్థికంగా, సామాజికంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఆయనకు ప్రతికూలంగా మారాయి. ప్రభుత్వం అందించిన పథకాలు అర్హులైన వారికి అందలేదనే అసంతృప్తి ఓటర్లను కొంతవరకు దూరం చేసింది. ఓటమిపాలైన ఆరూరి రమేష్ వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగిస్తున్న క్రమంలో ఆయన బిజెపి పార్టీలో చేరివరంగల్ ఏం పి గా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అప్పటి నుండి ఆక్టివ్ పాలిటిక్స్ రాకుండా ఉండడం సుమారుగా రెండు సంవత్సరాలు కావచ్చింది.
సోమవారం బిజెపి పార్టీకి రాజీనామా చేసి బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన చేసిన ప్రకటనల ద్వారా టిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది.
గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఆరూరి రమేష్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. అభివృద్ధి పనుల్లో ఉన్న వేగం తగ్గడం, నియోజకవర్గానికి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోవడంతో సామాన్య ప్రజలు ఆరూరి హయాంను గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లోనూ బాస్ ఈజ్ బ్యాక్ అనే నినాదం మార్మోగుతోంది. ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్న ఆరూరి, తన పాత తప్పులను సరిదిద్దుకుని, కార్యకర్తలకు సమన్యాయం చేస్తామనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. తన చాణక్యంతో ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, మళ్ళీ వర్ధన్నపేట గడ్డపై గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. ఈ పునరాగమనం నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మారుస్తుందో అని యావత్ రాష్ట్ర రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.