వార్తలు రాసేముందు బాధ్యతగా ఆలోచించాలిసోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలివర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజ్

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి20(జర్నలిస్ట్ వార్త):
వార్తలు రాసేముందు మీడియా ప్రతినిధులు బాధ్యతతో ఆలోచించాల్సిన అవసరం ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజ్ అన్నారు.మంగళవారం పురపాలక సంఘం పరిధిలో రూ.15 కోట్ల నగరాభివృద్ధి నిధులతో చేపట్టనున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సోమవారం 
ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో మహిళలకు రుణమాఫీ చెక్కులు, సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మహిళలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవకతవకలు, వర్ధన్నపేటలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, చెరువులో నీరు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మహిళలు ప్రశ్నించారు.
ఈ అంశాలపై సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేశారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవదని అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఉప్పరపల్లి క్రాస్ వద్ద ఆసుపత్రి నిర్మాణంతో తమకు ఎలాంటి వ్యక్తిగత లాభం లేదని, అక్కడ తమకు రియల్ ఎస్టేట్ భూములు లేవని స్పష్టం చేశారు. ఇసుక వ్యాపారుల నుంచి తాము ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదని, కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
గత 15 ఏళ్లుగా వర్ధన్నపేట నియోజకవర్గంలో చేయలేని అభివృద్ధిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపుతోందన్నారు. గతంలో మూడు టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసిన వారు ఏం అభివృద్ధి చేశారో ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని పేర్కొంటూ, కావాలని బ్రాహ్మణ సంఘాలను 
భూములు పోతాయని రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తండాలను మున్సిపాలిటీ నుంచి వేరుచేసే ప్రక్రియ ఆలస్యమైందని, ఎన్నికల అనంతరం మంత్రి సీతక్క చొరవతో తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 9 కౌన్సిలర్ స్థానాలు గెలిచి చైర్మన్ పదవిని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో పాత–కొత్త విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్పందించకపోతే తానే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజ్ హెచ్చరించారు. 
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్అరెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు శేఖర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయూబ్ లను ఇంచార్జిగా నియమించారని, కాంగ్రెస్ పార్టీ ని గెలిపించే బాధ్యత వారి భుజస్కంధాలపై ఉందన్నారు.