ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో, జనవరి 19 (జర్నలిస్ట్ వార్త):
నిబద్ధత, నిరంతర స్నేహ మాధుర్యానికి నిదర్శనంగా నిలిచిన ఇగ్నైటెడ్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ధర్మసాగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఘనంగా జరిగింది.పూర్వ ధర్మసాగర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన మిత్రులు 2010 సంవత్సరంలో ఈ సంస్థను ప్రారంభించారు. గత 16 సంవత్సరాల కాలంలో ఉద్యోగోన్నతులు, బదిలీల కారణంగా పూర్వ వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డప్పటికీ, స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటూ ప్రతి ఏడాది ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి రావుల శ్రీధర్ అధ్యక్షత వహించారు. జండా ఆవిష్కరణ, సామూహిక గీతాలాపన అనంతరం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వర్లు సంస్థ కార్యకలాపాల నివేదికను, కోశాధికారి మోహన్ ఆర్థిక నివేదికను సభ ముందుంచగా, సభ్యులు వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు.
తదుపరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ధర్మ ప్రకాష్ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సమావేశంలో నూతన కమిటీని రెండేళ్ల కాలానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, ధర్మసాగర్ ప్రధానోపాధ్యాయులు వెంగ్గల మురళిని అధ్యక్షులుగా, మల్లేశాన్ని ప్రధాన కార్యదర్శిగా, వీర రాఘవను కోశాధికారిగా ఎంపిక చేశారు. శ్రీధర్, ప్రకాష్, సంపత్, వెంకటేశ్వర్లు, సందీప్ ఉపాధ్యక్షులుగా, రంజాన్, కిరణ్, సురేష్, జగత్, ఈశ్వర్లును కార్యదర్శులుగా నియమించారు. మోహన్, సతీష్, అశోక్‌లను ఆడిట్ కమిటీ సభ్యులుగా నియమించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మనోజ్, నరసింహారావు, తెలుగు యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ గడ్డం వెంకన్న, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరికిపండ్లను సలహా సభ్యులుగా ఎన్నుకున్నారు.ముగింపు సభలో నూతన అధ్యక్షులు వెంగ్గల మురళి మాట్లాడుతూ, విద్యార్థుల అభ్యున్నతి, సభ్యుల సంక్షేమానికి దోహదపడే వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. అనంతరం సభ్యులందరూ ధర్మసాగర్ పెద్ద చెరువు సుందర పరిసర ప్రాంతాలను సందర్శించి, ఆత్మీయ వాతావరణంలో సందడి చేశారు.