వర్ధన్నపేట/జనవరి 20: (జర్నలిస్ట్ వార్త)
వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు అహర్నిశలు శ్రమిస్తున్నారని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడు కే.ఆర్. నాగరాజు అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లోనే సీఎం ఆర్‌ఎఫ్ కింద బాధితులకు ఆర్థిక సాయం అందించడం, రైతులపై జరిగిన అన్యాయాలను అసెంబ్లీలో లేవనెత్తడం, అవినీతి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వంటి అనేక ప్రజా సమస్యలపై ఆయన పోరాటం చేశారని తెలిపారు.
పర్వతగిరి రిజర్వాయర్ అవినీతి, పెరుమాండ్లగూడెం రైతులపై జరిగిన దాడులు, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలన్న డిమాండ్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్స్ నుంచి పిల్లకాలువల ఏర్పాటు వంటి అంశాలపై ఎమ్మెల్యే అసెంబ్లీలో గళమెత్తారని చెప్పారు. వలస కార్మికుడి మృతిపై స్పందించి స్వంత ఖర్చుతో ఆర్థిక సాయం అందించడం, ఎన్‌కౌంటర్‌లో మరణించిన అంగరక్షకుడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడం ఆయన మానవత్వానికి నిదర్శనమన్నారు.
రెండు సంవత్సరాల పాలనలోనే ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తిస్తున్నారని నరుకుడు వెంకటయ్య తెలిపారు.