వర్ధన్నపేట/జనవరి 23 (జర్నలిస్ట్ వార్త):
ఎస్సీ రిజర్వుడు అయిన వర్ధన్నపేట నియోజకవర్గంలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, వెలమ వర్గానికి చెందిన వ్యక్తిని నియోజకవర్గ ఇంచార్జీగా నియమించడం దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య తీవ్రంగా విమర్శించారు.
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. వర్ధన్నపేట ఒక ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అలాంటప్పుడు ఇక్కడ ఒక దళితునికే నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వాలి. కానీ దయాకర్ రావు అనే వెలమ దొరను నియమించడం మీ కులపిచ్చికి నిదర్శనం కాదా? అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న దయాకర్ రావు ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజలను ప్రలోభపెడుతూ రాజకీయ గారడీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పుకుంటూ నియోజకవర్గ ఇంచార్జీగా తిరుగుతున్నారు. కానీ వర్ధన్నపేటకు మీ వల్ల జరిగిన మేలు ఏమిటి? అని ప్రశ్నించారు. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని తెలిపారు.
ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి ఏడాదిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి రూ.10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు, రెండో ఏడాదిలో రూ.5 కోట్లు తీసుకొచ్చారని గుర్తుచేశారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మున్సిఫ్ కోర్టు మంజూరు, వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులతో పనుల ప్రారంభం జరగడం ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ఘనతేనన్నారు. ఇది ముమ్మాటికీ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అలాంటప్పుడు మా దళిత నియోజకవర్గంలో దొరల పెత్తనం ఎందుకు? అని నరుకుడు వెంకటయ్య ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తుళ్ల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిధుముళ్ల భాస్కర్, జిల్లా నాయకుడు మరుపట్ల సాయికుమార్, మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎం.డి. అక్బర్ తదితరులు పాల్గొన్నారు.