వర్ధన్నపేట / జనవరి 19 (జర్నలిస్ట్ వార్త):
మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజం సుస్థిర అభివృద్ధి సాధ్యమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు స్పష్టం చేశారు.
వర్ధన్నపేట పట్టణంలోని ఎం.ఎం.ఆర్. కళ్యాణ మండపం నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడంతో పాటు, 122 మహిళా సంఘాలకు 28 లక్షల 84 వేల 141 రూపాయల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు.తొలుత మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యే నాగరాజు కి, జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి కి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనతోనే కుటుంబాలు, సమాజం బలోపేతం అవుతాయని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం ద్వారా చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగవచ్చని పేర్కొన్నారు.ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించే లక్ష్యంతో రూపుదిద్దుకున్నదని అన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు రావాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు.మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మహిళల అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు తన వంతుగా నిరంతరం అందిస్తానని హామీ ఇచ్చారు.వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి, రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర పాఠశాల, ఉపకారాగారం, న్యాయస్థానం, రెవెన్యూ విభాగ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు పట్టణాభివృద్ధికి పదిహేను కోట్ల రూపాయలు, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ద్వారా ఐదు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే వర్ధన్నపేట పట్టణం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మి తప్పుదారి పట్టవద్దని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ సుధీర్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు, పట్టణ స్వయం సహాయక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు.