హైదరాబాద్/జనవరి19(జర్నలిస్ట్ వార్త):
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించేందుకు సోమవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌తో పాటు స్టేట్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ కమిటీ సభ్యుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ నాగరి ప్రీతం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా హాజరైన గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. దళిత వర్గాల హక్కుల కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ అంశాలపై జిగ్నేశ్ మేవానీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గాల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందిస్తూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభివృద్ధికి మరింత కట్టుబాటుతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, జనగామ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ పాల్గొని జిగ్నేశ్ మేవానీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ వర్గాల సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు నిర్వాహకులు తెలిపారు.