సెల్ ఫోన్ తో సహజీవనం మనిషిని బందీ చేస్తున్న స్టేటస్ సంస్కృతి

journalist vaartha
By -
వర్ధన్నపేట/జనవరి26(జర్నలిస్ట్ వార్త):
నేటి ఆధునిక కాలంలో మనిషికి మనిషికి మధ్య దూరం పెరుగుతుంటే, సెల్ ఫోన్ తో మాత్రం బంధం బలపడుతోంది. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోనే సర్వస్వంగా మారిపోయింది. ముఖ్యంగా వాట్సాప్ స్టేటస్‌లతో చెలిమి చేస్తూ, అందులోనే రోజంతా గడిపేస్తున్న పరిస్థితి నేడు వర్ధన్నపేట నియోజకవర్గంలోనూ, ప్రతి ఇంటా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఆప్యాయతలను పంచుకోవడానికి కలిసే మనుషులు, ఇప్పుడు కేవలం ఒక ఫోటో లేదా సెల్ఫీతో తమ జీవితం ముగిసిపోతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఏం తిన్నా, ఏ శుభకార్యం జరిగినా ముందుగా ఫోన్ కెమెరాకు పనిచెప్పడం, ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైకులు, కామెంట్ల కోసం ఎదురుచూడటం ఒక వ్యసనంగా మారింది. ఈ 'స్టేటస్' పిచ్చి ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. చదువుకున్న వారు తమ విద్యా వెతలు, కెయరీర్ సాధనల కంటే ఎక్కువగా ఫోన్ లోనే కాలం గడుపుతుండగా, ఉద్యోగులు ఆఫీసు పనిలో కంటే నోటిఫికేషన్లపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల పరిస్థితి సరేసరి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండటం కంటే, స్టేటస్ లలో తాము చేస్తున్న పనులను ప్రదర్శించుకోవడమే అసలైన రాజకీయంగా భావిస్తున్నారు. యువత అయితే సెల్ ఫోన్ తో సహజీవనం చేస్తూ, కళ్లెదుట ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. కనీసం తోటివారితో రెండు నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడే తీరిక లేకుండా, నిరంతరం ఫోన్ స్క్రీన్ పై వేళ్లను ఆడిస్తూ కృత్రిమ ప్రపంచంలో విహరిస్తున్నారు. నిజానికి ఫోన్ అనేది సమాచార మార్పిడికి ఒక సాధనం మాత్రమే కావాలి, కానీ అది నేడు మనిషిని నియంత్రించే శక్తిగా మారింది. పక్కనే ఉన్న ఆత్మీయులను పలకరించని వారు కూడా, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అపరిచితుల పోస్ట్‌లకు స్పందిస్తున్నారు. సెల్ఫీలు, ఫోటోల ఆడంబరంలో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఒకరి దుఃఖంలో పాలుపంచుకోవాలన్నా, ఒకరి విజయాన్ని అభినందించాలన్నా అది కేవలం స్టేటస్ వరకే పరిమితమవుతోంది. గుండె లోతుల్లోంచి రావాల్సిన స్పందన ఇప్పుడు ఎమోజీల రూపంలో సెల్ ఫోన్ తెరలపైనే ఆగిపోతోంది. ఈ డిజిటల్ మత్తు నుండి బయటపడి, మనుషులు మళ్లీ మనుషుల్లా కలిసి మెలిసి తిరుగుతూ, ముఖాముఖి మాట్లాడుకునే రోజొస్తుందా అని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెల్ ఫోన్ తో సహజీవనం చేస్తున్న నేటి తరం. అసలైన జీవితాన్ని మర్చిపోతోందన్నది కాదనలేని సత్యం. శత్రువులు చూడాలని, స్టేటస్ ల రపంలో వారు పెడుతున్న ఆ కామెంట్స్, పెడుతూ వారు తమ స్టేటస్ న చూడగానే హమ్మయ్య నా స్టేటస్ చూశారు కచ్చితంగా తనకు ఈ విషయం తెలుస్తుందని, అల్ప సంతోషంగా ఆనంద పడుతున్నారు. పాఠశాలకు పోయి వచ్చిన చిన్న పిల్లలతో సహా ఇంటికి రాగానే సెల్ఫోన్లో ఉన్న వీడియోలు స్టేటస్లు తమ ఫోటోలను చూసుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారే తప్ప ప్రత్యక్షంగా పుస్తకాలపై తమ దృష్టి సారించలేకపోతు, సహజ సిద్ధంగా వస్తున్న జ్ఞానాన్ని పెంపొందించుకోలేకపోతున్నారని డాక్టర్లు సైతం తమ సలహాలు అందిస్తున్న సెల్ఫోన్ పై ఉన్న మోజు తగ్గటం లేదనే వాస్తవ చెబుతున్నారు.