బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ వరంగల్ జిల్లా ఆవిర్భావ సభకు పిలుపు

journalist vaartha
By -
వర్ధన్నపేట/జనవరి 22 (జర్నలిస్ట్ వార్త):
తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన లక్ష్యంగా ఏర్పాటైన బీసీ–ఎస్సీ–ఎస్టీ ఐక్య కార్యాచరణ వేదిక వరంగల్ జిల్లా ఆవిర్భావ సభను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా అంబేడ్కరిజం జేఏసీ కన్వీనర్ తుమ్మల శ్రీధర్, రోడ్డ మురళీ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో తొంభై శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇప్పటివరకు ఉమ్మడి ఉద్యమ వేదిక లేకపోవడం వల్ల రాజకీయంగా తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. ఆ లోటును భర్తీ చేసేందుకే గత సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ–ఎస్సీ–ఎస్టీ హక్కులు, రాజ్యాధికార సాధన ఐక్య కార్యాచరణ వేదికను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈ వేదికను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయిలో విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాని భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జేఏసీ ఏర్పాటు కోసం ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏ రాజకీయ పార్టీలో, ఏ సంఘంలో ఉన్నా సరే తమ రాజ్యాంగ హక్కులు, రాజకీయ అధికారం కోసం ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ నెల 24న శనివారం ఉదయం పది గంటలకు వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి ఎదురుగా ఉన్న భారత వైద్య సంఘం సభా మందిరంలో ఈ ఆవిర్భావ సభ జరగనుందని తెలిపారు.
ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారధన్ మహారాజ్, బీసీ మేధావుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చిరంజీవులు, విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ హాజరుకానున్నారని వెల్లడించారు.
వివిధ కుల సంఘాలు, సామాజిక వేదికలలో పనిచేస్తున్న నాయకులు, మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు, మహిళలు, ప్రజాస్వామ్యవాదులు, బీసీ–ఎస్సీ–ఎస్టీ వర్గాలు, మైనారిటీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో కొండేటి సత్యం, తుమ్మల సామెల్ తదితరులు పాల్గొన్నారు.