కుర్చీకి బానిస… సమాజానికి శాపమా?

journalist vaartha
By -

ఐనా పర్వలేదు… కుర్చీ ఉండాలి!
ఇది నేడు రాజకీయాల్లో మాత్రమే కాదు… పరిపాలనలో, విద్యలో, సంఘాల్లో, సంస్థల్లో—అన్ని రంగాల్లో వినిపిస్తున్న అప్రకటిత నినాదం. పదవి కోసం త్యాగం చేయాల్సి వచ్చినా సరే, బోగానికైనా సిద్ధం అయ్యే పరిస్థితి మన చుట్టూ స్పష్టంగా కనిపిస్తోంది. విలువలు కాదు, విధానం కాదు, ప్రజలు కాదు—కేవలం కుర్చీ మాత్రమే కేంద్రబిందువుగా మారిన ఈ సంస్కృతి సమాజాన్ని ఎటు తీసుకెళ్తోంది? భవిష్యత్తు తరానికి ఇది ఏం బోధిస్తోంది?
ఒకప్పుడు పదవి అంటే బాధ్యత. అధికారం అంటే సేవ. కుర్చీ అంటే ప్రజల నమ్మకానికి ప్రతీక. కానీ నేడు కుర్చీ ఒక లక్ష్యంగా మారింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నైతికతను తాకట్టు పెట్టడం, సిద్ధాంతాలను తుంగలో తొక్కడం, అవసరమైతే మాట మార్చడం, వర్గం మార్చడం కూడా సాధారణమైపోయింది. నిన్న దాకా తప్పు అన్నది నేడు సరైందిగా మారిపోతోంది—అది కుర్చీ దక్కితే చాలు.
రాజకీయాల్లో చూస్తే ఇది మరింత బహిరంగం. ఎన్నికల ముందు మాటలు ఒకలా, గెలిచిన తర్వాత పనులు మరోలా. ప్రజల సమస్యల కంటే పదవుల పంపకంపైనే ఎక్కువ శ్రద్ధ. పార్టీలు మారడం, వర్గాలు విడిపోవడం—ఇవన్నీ సిద్ధాంతాల కోసం కాదు, కుర్చీల కోసమే అన్న భావన ప్రజల్లో బలపడుతోంది. దీని వల్ల ప్రజాస్వామ్యంపై నమ్మకం క్రమంగా క్షీణిస్తోంది.
ఇది రాజకీయాలకే పరిమితం కాదు. విద్యారంగంలో పదవుల కోసం అంతర్గత రాజకీయాలు, పరిపాలనలో అధికారం నిలుపుకోవడానికి రాజీ ధోరణి, సంఘాల్లో కుర్చీ వదలకుండా కూర్చునే నాయకత్వం—అన్నీ ఒకే రకమైన మానసికతకు నిదర్శనం. నేను ఉంటేనే సంస్థ బాగుంటుంది. అనే అహం, నా తర్వాత ఎవరూ లేరు.అనే భ్రమ ఇవే కుర్చీ బానిసత్వానికి మూలాలు.
ఇలాంటి పరిస్థితి భవిష్యత్తు తరానికి ఏం నేర్పిస్తోంది?
నిజాయితీ కంటే అవకాశవాదమే గొప్పదని?
కష్టపడటం కంటే దగ్గరి దారులే సులభమని?
విలువలకంటే విజయం ముఖ్యమని?
ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. ఎందుకంటే యువత అనేది మన సమాజానికి అద్దం. వారు చూసేదే నేర్చుకుంటారు. పెద్దలు కుర్చీ కోసం సిద్ధాంతాలు మార్చుకుంటే, యువత విలువలను ఎందుకు పట్టించుకుంటుంది? నాయకత్వం అంటే త్యాగం కాదు, లాభం అని భావిస్తే, రేపటి సమాజం మరింత స్వార్థపరంగా మారుతుంది.
కుర్చీ శాశ్వతం కాదు. పదవి కాలపరిమితి గలది. కానీ వ్యక్తి పేరు, అతని విలువలు మాత్రం చరిత్రలో మిగులుతాయి. దీనిని మరిచిపోయినప్పుడే సమాజం దారి తప్పుతుంది. కుర్చీ కోసం కాకుండా, కుర్చీ ద్వారా చేసే సేవ కోసం పోటీ పడే నాయకత్వం అవసరం.
ఇప్పటికైనా ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి
కుర్చీ మన కోసం ఉందా? లేక మనమే కుర్చీ కోసం ఉన్నామా?
ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతికిన రోజే, భవిష్యత్తు తరానికి ఒక మంచి దారి చూపించినవాళ్లమవుతాం. లేదంటే, కుర్చీకి బానిసలైన సమాజంగా మిగిలిపోవడం తప్ప మనకు మిగిలేది ఏమీలేదు.