వర్ధన్నపేట/జనవరి 26(జర్నలిస్ట్ వార్త);
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పతాకానికి వందనం సమర్పించిన ఎర్రబెల్లి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు
మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని, దృఢ, అదృఢ లక్షణాలతో కూడిన సమాఖ్య స్ఫూర్తికి ఇది నిదర్శనమని అన్నారు.
మహనీయుల కృషి: ఎందరో మహనీయుల మేధోకృషి, త్యాగాల ఫలితంగానే నేడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతోందని, ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుతూ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పార్టీ ఇన్చార్జిలు చింతల యాదగిరి, పోలపెల్లి రామ్మూర్తి, సిల్వర్ కుమారస్వామి, తుమ్మల యకయ్య, తోటకూర రాజమణి, ఎండి అజీమ్ పాల్గొన్నారు.