పొరపాట్లకు తావు లేకుండా నామినేషన్లు దాఖలు చేయాలి._సహాయక జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి 30(జర్నలిస్ట్ వార్త);
ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించే సమయంలో ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలని సహాయక జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ సూచించారు. నామినేషన్ ప్రక్రియపై అభ్యర్థుల అవగాహన కోసం ఆయన పలు మార్గదర్శకాలను విడుదల చేశారు.

మొదటి దశ పత్రాల సేకరణ

అభ్యర్థి మరియు ప్రతిపాదకుడు తమ ఓటరు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. కుల ధ్రువీకరణ పత్రం, ఎటువంటి బకాయిలు లేవని తెలిపే పత్రం, ఆస్తులు, విద్యార్హతలు, నేర చరిత్ర వివరాలతో కూడిన స్వయం ప్రకటన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది.

రెండో దశ దరఖాస్తు దాఖలు ప్రక్రియ

ధరావత్తు రుసుము పురపాలక సంఘాల్లో సాధారణ అభ్యర్థులు రూ. 2000, ఇతరులు రూ. 1250 చెల్లించాలి. నగరపాలక సంస్థల్లో సాధారణ అభ్యర్థులు రూ. 5000, ఇతరులు రూ. 2500 కట్టాలి.

దాఖలు విధానం...

 అభ్యర్థి ప్రతిపాదకుడు కలిసి వెళ్లాలి. ఒక వార్డుకు గరిష్టంగా 4 దరఖాస్తులు సమర్పించవచ్చు. ఒక్కో అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు మాత్రమే ఉండాలి.

సమయ పాలన...

 నిర్ణీత సమయం ముగియగానే కార్యాలయ తలుపులు మూస్తారు. నిబంధనల ప్రకారం లోపలికి అభ్యర్థితో కలిపి ముగ్గురిని మాత్రమే అనుమతిస్తారు.

మూడో దశ గుర్తు ఎంపిక...

గుర్తింపు పొందిన పార్టీల వారికి ఆ పార్టీ గుర్తే కేటాయిస్తారు. స్వతంత్రులు తమకు నచ్చిన మూడు గుర్తులను వరుస క్రమంలో ఎంచుకోవాలి. ఈ వివరాలను జనవరి 30 సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలి. పోటీ నుండి తప్పుకోవాలనుకునే వారు నిర్ణీత రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు దరఖాస్తును వెనక్కి తీసుకోవాలి.

ఖర్చు పరిమితి...

పురపాలక అభ్యర్థులు రూ. 1.5 లక్షలు, నగరపాలక అభ్యర్థులు రూ. 2.5 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అనుమతి ఉంది. దరఖాస్తు ప్రక్రియ ముగిశాక అధికారులు ప్రకటించే తుది జాబితాను నోటీసు బోర్డులో తనిఖీ చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.