తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో గ్రామీణ పాలనలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన నూతన సర్పంచులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ పాలనపై ప్రజాస్వామ్య బాధ్యత మరింత పెరిగిందనే చెప్పాలి. ఇది కేవలం పరిపాలనా విధి కాదు… ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేసంకల్పానికి నిదర్శనం.దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది గ్రామస్థాయి పాలన. గ్రామపంచాయతీలే ప్రజలతో అత్యంత సమీపంగా ఉండే పాలనా సంస్థలు. అలాంటి వ్యవస్థకు నాయకత్వం వహించే సర్పంచుల పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలులోకి రావాలంటే ప్రజలతో నేరుగా మమేకమయ్యే పాలన అవసరం. గ్రామసభల నిర్వహణ, ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం, నిర్ణయాల్లో పారదర్శకత—ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రాణం.
గ్రామాభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు మాత్రమే కాదు. తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, విద్యుత్, రహదారులు వంటి మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రజల జీవన ప్రమాణాల పెంపే అసలు లక్ష్యం కావాలి. గ్రామాల్లో పారిశుధ్య లోపాలు, తాగునీటి సమస్యలు ఇంకా ఎన్నో చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. వీటిపై నూతన పాలకవర్గాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.అలాగే గ్రామీణ ఉపాధి కల్పన అత్యంత ప్రాధాన్య అంశం. ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలవ్వాలి. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక బలం చేకూర్చడం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించడం ద్వారా గ్రామాలు స్వయం ఆధారితంగా మారగలవు. మహిళలు, యువత అభివృద్ధిలో భాగస్వాములైతే గ్రామాల భవిష్యత్తు మరింత బలపడుతుంది.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా పర్యవేక్షణ చేయడం గ్రామ పాలకుల ప్రధాన బాధ్యత. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం లేకుండా న్యాయం పాటించాలి. రాజకీయాలకు అతీతంగా, గ్రామ హితమే లక్ష్యంగా పాలన సాగితేనే ప్రజల విశ్వాసం నిలుస్తుంది.
గ్రామాభివృద్ధి సమిష్టి కృషితోనే సాధ్యమవుతుంది. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు అందరూ కలిసి పనిచేయాల్సిందే. ప్రజల భాగస్వామ్యంతో తీసుకునే నిర్ణయాలే దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి.గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరేసే ఈ సందర్భం, నూతన సర్పంచులకు ఒక హెచ్చరిక కూడా… ఒక అవకాశం కూడా. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాల్సిన బాధ్యతను గుర్తుచేసే ఘట్టమిది.గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే పాలన సాగితే గ్రామాలు ఆదర్శంగా నిలుస్తాయి
సీనియర్ జర్నలిస్ట్ కొట్టే సుధాకర్ లెనిన్ 9908401581