వర్ధన్నపేట/జనవరి 26 (జర్నలిస్ట్ వార్త):
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం వర్ధన్నపేట తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. తాసిల్దార్ విజయ సాగర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం తాసిల్దార్ విజయ సాగర్ జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరిస్తూ, అందరిలో దేశభక్తిని నింపారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు తాసిల్దార్ పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చార. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ విరాజిల్లుతోందని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు ప్రతి ఒక్కరికీ దిక్సూచి వంటివని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుందని పేర్కొంటూ, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, నాయబ్ తాసిల్దార్లు, ఆర్.ఐల, జిపిఓలు సర్వేర్లు తదితరులు పాల్గొన్నారు.