వర్ధన్నపేట/జనవరి18 (జర్నలిస్ట్ వార్త):
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహస్వామి సూచించారు. పెద్దలు చెప్పినట్లుగా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న నాదున్నిగుర్తుంచుకుని, ప్రతి కుటుంబం ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
చలికాలం ముగిసి వేసవి కాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వాతావరణ మార్పుల కారణంగా జలుబు, జ్వరాలు, వళ్లునొప్పులు, గొంతునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉదయం వేళ కాచిన నీటిని తాగడం, గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం శరీరానికి శక్తినిచ్చి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని వివరించారు.
అలాగే బయట ఆహారానికి దూరంగా ఉండి, ప్రతి కుటుంబంలో రోజువారీగా ఇంటి వంటలు చేసుకుని వేడి పదార్థాలను మాత్రమే తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, దీని వల్ల చిన్న చిన్న వ్యాధులు దరిచేరవని తెలిపారు.
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శుభ్రమైన జీవన విధానం అలవర్చుకుంటే కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా గడపగలదన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా సమాజ పట్ల ఉన్న కర్తవ్యమని డాక్టర్ నరసింహస్వామి పేర్కొన్నారు.