నర్సంపేట/జనవరి 23 (జర్నలిస్ట్ వార్త):
నర్సంపేట మండలం ముగ్ధంపురం గ్రామ పరిధిలోని చెరువు సమీపంలోని పొలాల్లో మొసలి సంచరిస్తుండటంతో రైతుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పొలాలకు వెళ్లేందుకు కూడా రైతులు వెనకాడే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందగానే అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సరిత, బీట్ ఆఫీసర్ యోగేష్‌తో పాటు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి అప్రమత్తతతో సహాయక చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మొసలిని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షిత అటవీ ప్రాంతానికి తరలించి వదిలివేశారు.
అటవీశాఖ సిబ్బంది సమయస్ఫూర్తితో చేపట్టిన చర్యలతో గ్రామంలో నెలకొన్న భయాందోళనలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ సందర్భంగా ముగ్ధంపురం గ్రామ రైతులు అటవీశాఖ అధికారుల ధైర్యసాహసాలను, పనితీరును ప్రశంసించారు.