ధర్మసాగర్/, ఫిబ్రవరి హనుమకొండ బ్యూరో 5 (జర్నలిస్టు వార్త);పేద వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా అందించే కల్యాణ లక్ష్మి పథకం తల్లిదండ్రులకు పెద్ద ఊరటగా నిలుస్తోందని అన్నారు.వేలేరు మండల కేంద్రం రైతు వేదికతో పాటు ధర్మసాగర్ మండల కేంద్రం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా
వేలేరు మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు రూ.26,03,016,
ధర్మసాగర్ మండలానికి చెందిన 69 మంది లబ్ధిదారులకు రూ.69,08,004,
కాజీపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు రూ.6,00,696 విలువైన చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు.
సంక్షేమానికి అడ్డంకి కాదు – అవినీతి
ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు పూర్తిగా పారదర్శకంగా అమలవుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటికే పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గ్రామాలే అభివృద్ధికి పునాదికొత్తగా ఎన్నికైన సర్పంచులు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయవచ్చని, అనంతరం గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండి పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని హితవు పలికారు.
రెండు ఏళ్లలో సంక్షేమ విప్లవంరాష్ట్రంపై అప్పుల భారం ఉన్నప్పటికీ పేదలు, రైతులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కడియం శ్రీహరి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని చెప్పారు.
గత పాలకుల హయాంలో నియోజకవర్గానికి చెడ్డ పేరు వచ్చిందని విమర్శించిన ఆయన, ఆ పరిస్థితిని తొలగించి అవినీతి రహిత సుపరిపాలన అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.