చేవెళ్ల హామీ ఏమైంది..?దళితులకు 12 లక్షలు ఎక్కడ – కాంగ్రెస్‌ను నిలదీశిన మైస ఉపేందర్ మాదిగ

journalist vaartha
By -

కాజీపేట,/హనుమకొండ బ్యూరో ఫిబ్రవరి 24: (జర్నలిస్ట్ వార్త)చేవెళ్ల వేదికగా ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి వస్తే ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేసిందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ మండిపడ్డారు. “అంబేద్కర్ అభయ హస్తం” పేరుతో ప్రకటించిన పథకం అమలు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా ఎస్సీలకు పది లక్షల రూపాయలు అందజేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే కలెక్టర్ ఖాతాల్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. “ప్రజాపాలన” అంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయకపోతే అది ప్రజలతో మోసం చేసినట్టేనని విమర్శించారు.
హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, అమలులో వెనుకడుగు వేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని ఆరోపించారు. వెంటనే అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలని, లేనిపక్షంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పనున్నట్లు హెచ్చరించారు.
మార్చి 18న సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి దళిత మహాసభను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీల ప్రతినిధులు భారీగా హాజరై మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు బరిగెల ప్రకాష్, వరంగల్ జిల్లా అధ్యక్షులు పుల్ల రమేష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కత్తి రాజు, భద్రాద్రి జిల్లా కన్వీనర్ ఆరూరి రవి, వరంగల్ యూత్ అధ్యక్షులు కొమ్ముల అబ్బుల్, బైరపాక జోజి, కందుకూరి ప్రభాకర్, కుర్సపెళ్లి రమేష్, కందుకూరి ఆదాం, వస్కుల సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.