ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో, ఫిబ్రవరి 24: (జర్నలిస్ట్ వార్త)సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ సహజ వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా ధర్మసాగర్ మండలంలోని ధర్మపురం గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 125 మంది రైతుల వివరాలను అంతర్జాల నమోదు ప్రక్రియలో చేర్చారు.ధర్మపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి రాజేష్ అధ్యక్షత వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి పవన్ కళ్యాణ్, క్షేత్ర వనరుల వ్యక్తి కంకటి సరిత సంపత్ రైతులకు సహజ వ్యవసాయ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వాడకం వల్ల నేల సారం తగ్గిపోవడం, ఖర్చులు పెరగడం వంటి సమస్యలను వివరించి, సహజ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల నేల సారవంతత పెరిగి దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు.
ఈ సందర్భంగా కంకటి సంపత్ ద్రవ జీవామృతం తయారీ విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించి వివరించారు. గోమయం, గోమూత్రం, బెల్లం, పిండి వంటి సహజ పదార్థాలతో ద్రవ జీవామృతం తయారు చేసి పంటలకు వినియోగించడం ద్వారా నేలలో సూక్ష్మజీవులు పెరిగి పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు.
సహజ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి సాధ్యమవుతుందని, రైతులు స్వావలంబన దిశగా ముందుకు సాగాలని అధికారులు పిలుపునిచ్చారు. గ్రామాన్ని సహజ వ్యవసాయంలో ఆదర్శంగా నిలబెట్టేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోమ్మినేని రమాదేవి, ఉపసర్పంచ్ గొట్టం రవివర్మ, రగొత్తం రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణను ఆసక్తిగా వినిపించారు.