ధర్మసాగర్ / హనుమకొండ, ఫిబ్రవరి 27 (జర్నలిస్ట్ వార్త):మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని చాహత్ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. శుక్రవారం ధర్మసాగర్ మండలంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారుల్లో చురుకుదనం పెంచారు.మొదట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, పహాణీ పత్రాలు, కుల–ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం లేకుండా చూడాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమయానికి సేవలు అందించాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనులు, ఈజీఎస్ కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మండలంలో వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల వివరాలను ఎంపీడీవో అనిల్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. పనులు ఆలస్యమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.తనిఖీల సమయంలో వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.