పొలిమేర జయరావుకు ఘన సత్కారం45 ఏళ్ల అనంతరం ఒక్కటైన ధర్మసాగర్ పూర్వ విద్యార్థులు

journalist vaartha
By -
ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో, ఫిబ్రవరి 22 (జర్నలిస్ట్ వార్త):
కాలం గడిచినా స్నేహబంధాలు చెదరని అనుబంధాలుగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు పేర్కొన్నారు. మండలంలోని ఏలుకుర్తి గ్రామం తంగేడి రిసార్ట్‌లో జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ధర్మసాగర్ 1981–82 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.దాదాపు నలభై ఐదు సంవత్సరాల అనంతరం ఒక్కచోట చేరిన సహపాఠులు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చదువుకున్న రోజుల్లోని సరదాలు, ఆటపాటలు, గురువుల బోధనలు, పాఠశాల ఆవరణలో గడిపిన మధుర క్షణాలు మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమైనట్లు అనిపించాయి. అనుబంధాల ఆత్మీయతతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.ఈ సందర్భంగా తమ బ్యాచ్‌కు చెందిన పొలిమేర జయరావు అంచెలంచెలుగా ఎదిగి ఏలూరు పీఠాధిపతిగా కొనసాగుతున్నందుకు సహచర మిత్రులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. స్నేహబంధాలు కాలానికి అతీతమని, పూర్వ విద్యార్థుల కలయిక జీవితం మొత్తం గుర్తుండిపోయే అనుభూతి అని ఆయన అన్నారు.సమావేశంలో మాట్లాడిన ఆయన, “జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరూ కుటుంబ బాగోగులను కాపాడుకోవాలి. ఒత్తిడులు, వేదనలు మనసును కృంగదీయకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. నిత్యం నడక అలవాటు చేసుకోవడం, శారీరక శ్రమ చేయడం, చిరునవ్వుతో జీవించడం మనకు రక్షణ కవచంలాంటివి” అని సూచించారు. పిల్లలు, మనవళ్లతో ఆనందంగా శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.అనంతరం ఉద్యోగ విరమణ పొందిన పూర్వ విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు. పరస్పరం కుశల ప్రశ్నలతో, జ్ఞాపకాల పంచుకునే కార్యక్రమంతో సమ్మేళనం స్నేహసౌరభంతో ముగిసింది.కార్యక్రమంలో వేల్పుల చిన్ని, నాగవెల్లి సుధాకర్, డాక్టర్ వంగ సత్యనారాయణ, బొందుగుల విక్రమ్ రాజ్, బొడ్డు వాసుదేవ్, షేక్ మస్తాన్ బాబా, పోలుమేర ప్రభుదాస్, బొడ్డు ప్రసాద్, కొట్టే సుధాకర్, బొడ్డు కర్రప్ప, బొడ్డు ఇమ్మానుయేల్, బేర దేవేందర్, గంగరపు విజయ, ఇంద్రావతి, అరుణ, సరోజన, హైమ, సుధారాణి, కృప తదితరులు పాల్గొన్నారు.