వర్ధన్నపేట/ఫిబ్రవరి 4 (జర్నలిస్ట్ వార్త);
మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థులకు ఎన్నికల వ్యయం నియమావళి అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసే ప్రతి రూపాయి ఖర్చును లెక్కించాల్సి ఉంటుంది. కమిషన్ నిర్ణయించిన పరిమితికి లోబడే ఖర్చులు ఉండాలని వివరించారు. ప్రచారం కోసం చేసే ఖర్చులను ఎప్పటికప్పుడు ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేయాలని, బిల్లులు, వోచర్లు భద్రపరచాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగాలంటే అభ్యర్థులు తమ వ్యయ వివరాలను పారదర్శకంగా ఉంచాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించినా, తప్పుడు వివరాలు సమర్పించినా చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, అభ్యర్థిత్వంపై ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అభ్యర్థుల సహకారం చాలా అవసరం. ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిశీలకులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, తహసిల్దార్ విజయ్ సాగర్, స్థానిక ఎస్సై సాయిబాబు, వివిధ పార్టీల అభ్యర్థులు , తదితరులు పాల్గొన్నారు.