వరంగల్/ఫిబ్రవరి 15(జర్నలిస్ట్ వార్త);
మున్సిపల్ చైర్ పర్సన్ల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు మున్సిపల్ కార్యాలయాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపల్ కార్యాలయాల పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు సీపీ ప్రకటించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. మున్సిపల్ కార్యాలయాల వద్ద ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటం నేరమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు, కౌన్సిలర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ పరిసరాల్లో చెక్‌పోస్టులు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.