వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ధర్నా
By -
February 15, 2026
వర్ధన్నపేట/ఫిబ్రవరి16(జర్నలిస్ట్ వార్త); వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నాడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతన కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమ కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులను అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుబడుతూ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను అడ్డుకోవడం శోచనీయమన్నారు. మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం వంటి కీలక ఘట్టాన్ని ప్రజలకు చేరవేయకుండా ఆంక్షలు విధించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. లోపల ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు.