ధర్మసాగర్, హనుమకొండ బ్యూరో, ఫిబ్రవరి 14 (జర్నలిస్ట్ వార్త):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాయగూడెం, చిన్న పెండ్యాల–చిల్పూర్ గుట్ట సమీపంలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతి సహిత సోమలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలను ఈనెల 15వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం భక్తిరసమయంగా మారింది. ముందస్తుగా చేపట్టిన విస్తృత ఏర్పాట్లు, పూజా కార్యక్రమాల నిర్వహణ భక్తులను ఆకట్టుకున్నాయి.
లింగోద్భవ కాలంలో విశేష పూజలు
మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ మహిమాన్విత సమయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, రుద్రాభిషేకం, రుద్రహోమం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. వేదమంత్రోచ్చారణల నడుమ జరిగిన ఈ పూజలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది.
ఉదయం నుంచే భక్తుల రద్దీ
ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు స్వామివారి ఆరగింపు అనంతరం తీర్థప్రసాద వితరణ చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు.
మధ్యాహ్నం రుద్రహోమం ఘనంగా
మధ్యాహ్నం రుద్రహోమ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. 12:30 గంటలకు ఆరగింపు, తీర్థప్రసాద వితరణ అనంతరం భక్తుల కోరికల మేరకు ప్రత్యేక అభిషేకాలు కొనసాగించారు. ఆలయ పరిసరాలు జాగరణ భక్తితో కళకళలాడాయి.
సాయంత్రం కల్యాణ మహోత్సవం
సాయంత్రం 6:30 గంటలకు శివపార్వతుల దివ్య కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ దర్శనంతో కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణ వేడుకలో భక్తుల హర్షధ్వానాలు మారుమోగాయి.
భక్తులకు కృతజ్ఞతలు